schedule Saturday, June 13, 2026

నరమేధాన్ని ఆపాలి

calendar_today May 26, 2025
person meenewstelugu

నరమేధాన్ని ఆపాలి

 ⏩:-మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి

 ⏩:-ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి

 ⏩:-సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

మీ న్యూస్ ప్రతినిధి:-మోతే : చత్తీస్ గడ్ లో కేంద్ర బలగాలు చేపట్టిన నరమేధాన్ని తక్షణమే ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 27మందిని ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

 చర్చలకు తాము సిద్దమేనని మావోయిస్టులు పదేపదే చేసిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టి అమానవీయంగా మావోయిస్టులను తుడిచిపెట్టే విధానాన్ని అనుసరిస్తున్నాయని విమర్శించారు. పైగా ప్రధాని, హోంమంత్రి ప్రకటనలు ఎన్‌కౌంటర్‌పై హర్షం వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.

 అనేక రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు మావోయిస్టులతో చర్చలు జరిపే విషయాన్ని పరిశీలించాలని పలు విజ్ఞప్తులు చేశాయన్నారు. మావోయిస్టు రాజకీయలతో భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ వారితో వెంటనే చర్చలు జరపాలని, పారామిలటరీ దాడులను ఆపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చత్తీస్ గడ్ లో జరిగిన ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సెట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని కోరారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. అటవీ సంపద, ఖనిజాలు, వనరులు, భూమిని అంబానీ, హదాని వంటి కార్పోరేట్ సంస్థల అధిపతులకు అప్పగించడం కోసమే ఆపరేషన్ చేపట్టిందని విమర్శించారు. శాంతి భద్రతల సమస్యగా సృష్టించి బూటకపు ఎన్కౌంటర్ లు చేస్తున్నారని అన్నారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృత సమస్యగా పరిగణించి చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించారు. శాంతి భద్రతల సమస్యగా చూడడం సరైనది కాదన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు ప్రజలంతా ఉద్యమించాలని అన్నారు. మావోయిస్టులపై దాడుల పేరుతో ఆదివాసులను చంపుతున్నారని విమర్శించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు చేపట్టాలని కోరారు.