డబుల్ బెడ్ రూంను పేదల కోసమా? కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం?
••డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో పారదర్శకత లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు
••అనర్హులకు ఇండ్లను అమ్ముకుంటున్నారని మండిపాట
••గందరగోళం మద్య ఎంపిక
•• రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ తీవ్ర హెచ్చరిక
మీ న్యూస్ తాండూర్::తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ప్రతిపక్షాలను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది" అని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్. శుభప్రద్ పటేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రోజు వారు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను అధికారిక సమావేశం అని పిలిపించి, మరోపక్క పోలీసులను ప్రయోగించి అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని, ఇది వారి చేతగానితనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. పోలీసుల అండతో తాండూర్‌లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ, పాలనను అస్తవ్యస్తం చేస్తున్నారని మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదల ఆత్మగౌరవ ప్రతీకగా నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ గృహాల కేటాయింపుల్లో అధికార పార్టీ అక్రమాలకు తెరలేపిందని ఆరోపించారు. అర్హులైన నిజమైన పేదలు, బలహీన వర్గాలు, మరియు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన తెలంగాణ ఉద్యమకారులకు మాత్రమే ఈ ఇళ్లు, ఇళ్ల స్థలాలు దక్కాలని వారు స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులను పక్కనబెట్టి, కాంగ్రెస్ నేతలు తమ అనుచరులకు, అనర్హులకు ఇళ్లను కట్టబెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని, అది సామాజిక న్యాయానికే గొడ్డలిపెట్టు అని హెచ్చరించారు.
గతంలో దరఖాస్తు చేసుకుని, ఏళ్ల తరబడి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న వేలాది నిరుపేద కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా జరగాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అర్హుల జాబితాను బహిరంగంగా ప్రజల ముందు ఉంచాలన్నారు. ప్రజల నుండి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాతే తుది జాబితాను ఖరారు చేయాలని సూచించారు.
పేదల హక్కులను హరిస్తూ, రాజకీయ పక్షపాతంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తే సహించే ప్రసక్తే లేదని శుభప్రద్ పటేల్ హెచ్చరించారు. *నిరుపేదలకు, ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలపై పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తుందని, అవసరమైతే రోడ్లపైకి వచ్చి ఉధృతమైన ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు.