మీ న్యూస్ ప్రతినిధి మే 14:-వేసవి కాలంలో పార్క్ చేసిన వాహనాల్లోకి అనుకోకుండా వెళ్ళిన పిల్లలు తీవ్రమైన వేడిమి వల్ల ఊపిరాడక మృతి చెందుతున్న సంఘటనలు చాలా చోట్ల ఇటీవల నమోదైనాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ ప్రకటనలో తెలిపినారు. జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా విలువైన చిన్నారుల ప్రాణాలను రక్షించగలం అని ఎస్పి అన్నారు.
కొన్ని సూచనలు:
- వాహనాన్ని లాక్ చేయకముందు వాహనంలో ఎవరైనా ఉన్నారా అని పూర్తిగా తనిఖీ చేసుకోవాలి. ముందు, వెనుక సీట్లను గమనించి పరిశీలించుకోవాలి.
- పార్క్ చేసే వాహనంలో లేదా వాహనం చుట్టుపక్కల పిల్లలను ఒంటరిగా వదిలివెళ్ళకూడదు.
- వాహన తాళాలను పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. అనుకోకుండా వాహనంలోకి వెళ్లి చిక్కుకుపోయే ప్రమాదం గమనించగలరు.
- వాహనాలు ఆడుకునే ప్రదేశాలు కాదని పిల్లలకు స్పష్టంగా అర్థమయ్యేలా తెలియజేయాలి.
- వాహనాల్లో ఒంటరిగా ప్రవేశించరాదని వారికి అర్థమయ్యేలా వివరించి చెప్పాలి.
- "రియర్ సీట్ రిమైండర్", "చైల్డ్ డిటెక్షన్ అలర్ట్" వంటి భద్రతా పరికరాలను వాహనాల్లో అమర్చండి.
- వాహనాల విండోలకు బ్లాక్ ఫిల్ములు లేదా అధిక టింటింగ్ ఉపయోగించరాదు—వాహనంలో ఎవరైనా ఉంటే గుర్తించలేని ప్రమాదం ఉంది.
- వాహనం వాడకంలో లేకపోయినప్పటికీ డోర్లు, విండోలను పూర్తిగా మూసి లాక్ చేయాలి.
- పిల్లలు కనిపించకుండా పోతే, వాహనాల్లో, సమీప వాహనాల్లో పరిశీలించాలి.