మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట:హిందువులు పవిత్రంగా ఉపవాస దీక్షలు చేసి అత్యంత భక్తిశ్రద్ధలతో ఎక్కువ సంఖ్యలో నిర్వహించుకునే పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. శివరాత్రి రోజున శివున్ని పూజిస్తే విశేష పుణ్యఫలాలు అందుతాయని పురాణాలు చెప్తున్నాయి. పరమశివుడు లింగరూపంలో ఉద్భవించిన శివరాత్రి వేడుకలకు దాదాపు అన్ని గ్రామాల్లో చిన్న, పెద్ద దేవాలయాల్లో శివ పార్వతుల కళ్యాణం నిర్వహించి జాగరణ చేయడం ఆనవాయితీ. జిల్లాలో ప్రసిద్ధి చెందిన చారిత్రక దేవాలయాలైన పిల్లలమర్రి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున మూడు గంటలనుండే ప్రారంభమైన మహాన్యాస పూర్వక రుద్రాభిషేకానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహాదేవ నామేశ్వర స్వామి, త్రికూటాలయాలలో సామూహిక అభిషేకాలు నిర్వహించారు.
పోటెత్తిన భక్తజనం :: హర హర మహాదేవ శంభో శంకర నామస్మరణతో భక్తులు పులకించిపోయారు. అభిషేకాలు, పూజలు చేసి దీక్షలు చేశారు. ఏటేటా పెరుగుతున్న భక్తుల రద్దీతో క్యూలైన్లలో బారులు తీరారు.
శివాలయాలను సందర్శించిన ప్రముఖులు::మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి సునీత దంపతులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ దంపతులు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి లావణ్య దంపతులు సందర్శించి పూజలు చేశారు.
రాత్రి జరగనున్న కళ్యాణం::మహా శివరాత్రి పర్వదినాన రాత్రి 12 గంటలనుండి శివపార్వతుల కళ్యాణం జరగనుంది. ముందుగా ఎరకేశ్వర స్వామి దేవాలయం లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉపవాసం, జాగరణ ఉండే భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలిరానున్నారు.
పోలీసుల బందోబస్తు భేష్::పిల్లలమర్రి శివాలయాలకు ఏటేటా పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సూర్యాపేట డిఎస్పీ మంగళవారం సందర్శించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి పలు సూచనలు చేశారు. సీఐ రాజశేఖర్, ఎస్సై బాలు నాయక్ ఆధ్వర్యంలో బుదవారం తెల్లవారు జామునుండే బందోబస్తు చేపట్టారు. గతంతో పోలిస్తే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నారు.