మా ఐదెకరాల భూమిని అక్రమంగా వేరే వ్యక్తిలకు పట్టా చేశారు
⏩:: కలెక్టర్ స్పందించి 13బి పై లోతైన విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
⏩::మాభూమిని మాకు పట్టా చేయించండి
మీ న్యూస్ ప్రతినిధి మే 6::నా పేరున ఉన్న ఐదు ఎకరాల భూమిని నా మరిది అక్రమంగా నకిలీ పత్రాలు సృష్టించి పట్టా చేయించుకున్నాడని ఆయనకు అధికారులు సహకరించారని ఈ విషయమై విచారణలో వాస్తవమే అని తేలినప్పటికీ ఆ పాసుబుక్ ను క్యాన్సిల్ చేసి మా భూమిని మాకు పట్టా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆత్మకూర్. ఎస్ మండల పరిధిలోని ఇస్తాల పురం గ్రామానికి చెందిన బాధితురాలు నిమ్మల భారతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తన గోడు వెల్లబోసుకున్నారు. నెమికల్ గ్రామ శివారులో సర్వేనెంబర్ 75, 76 లో 1989 నా భర్త నిమ్మల భద్రయ్య కొనుగోలు చేసిన 8 ఎకరాల భూమిలో నా మరిది నిమ్మల మాధవరావు భార్య సంధ్య పేరున మూడెకరాల భూమి 1994లో రిజిస్ట్రేషన్ చేశాడన్నారు. ఇదిలా ఉండగా 2009లో మాకు ఉన్న ఐదు ఎకరాల భూమిని కూడా మా మరిది మాధవరావు అక్రమంగా పట్టా చేయించుకునేందుకు ప్రయత్నించగా తన భర్త గమనించి తాసిల్దార్ కు ఫిర్యాదు చేయగా ఆ భూమిని ఎవరు అమ్మకూడదు కొనకూడదు అని ఉత్తర్వులు జారీ చేశాడన్నారు. 2019లో నా భర్త భద్రయ్య చనిపోగా నాకు ఐదుగురు ఆడపిల్లలు కావడంతో తలా ఒక దిక్కున ఉంటున్నామన్నారు. 2024 మేము భూమి పైకి వచ్చి చదును చేసి కౌలుకు ఇవ్వగా మా మరిది మాధవరావు నకిలీ పత్రాలతో అక్రమంగా చేసుకున్న పట్టా పాస్ పుస్తకం తో భూమి నాది అంటున్నాడని అన్నారు. ఈ విషయమై తాము కలెక్టర్కు ఫిర్యాదు చేయగా ప్రొహిబిటెడ్ లో ఉన్న భూమిని ఎలా పట్టా చేశారని ప్రశ్నిస్తూ అధికారులను విచారణకు ఆదేశించాడన్నారు. ఏప్రిల్ 16న జరిగిన విచారణలో మరిది కొడుకు హనుమంతరావు నకిలీ 13 బి, ఆర్ఐ రిపోర్టు, సంబంధం లేని రైతుల అభిప్రాయాలు, సాదా బైనమా లేకుండా నకిలీ పాస్ బుక్ తో ఒకే చేతి రాత కలిగి అక్రమంగా పట్టా చేయించుకున్నాడని గుర్తించారన్నారు. అక్రమంగా పట్టా చేయించుకున్నది వాస్తవమేనని తేలినప్పటికీ గత 20 రోజులుగా అధికారులు ఆ పట్టా పాస్ బుక్ ను క్యాన్సల్ చేయడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆ పట్టా పాస్బుక్ ను క్యాన్సిల్ చేయించి అసలైన నాకు పట్టా పాస్ బుక్ అందజేసి న్యాయం చేయాల్సిందిగా అధికారులను వేడుకున్నారు. ఈ విషయమై మా కుటుంబం గురించి ఆర్ డి ఓ కి అన్ని విషయాలు తెలుసని ఇప్పటికే మండల స్థాయి అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు సమర్పించామని ఆర్థికంగా నలిగిపోయామని మా బాధను అర్థం చేసుకొని మాభూమి మాకు అప్పగించాలని వేడుకున్నారు. ఆమె వెంట కుమార్తె నిమ్మల జ్యోతి తదితరులు ఉన్నారు.