⏩::హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ
⏩::8వ తేదీ తర్వాత ఇతర ప్రాంతాల్లో
మీ న్యూస్ ప్రతినిధి::హైదరాబాద్ రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రజల ఎదురుచూపులు ఫలించనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 26న 16,900 కుటుంబాలకు పంపిణీ చేయగా.. మార్చి 1న హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ప్రస్తుతానికి ఈ జిల్లాల్లో మాత్రమే ఎన్నికల కోడ్ లేకపోవడంతో వీటిని ఎంపిక చేశారు. వచ్చే నెల 8 తరువాత మిగతా జిల్లాల్లో జారీ ప్రక్రియ చేపట్టనున్నారు. నూతన రేషన్‌కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో, ప్రజావాణిలో, మీ-సేవా వెబ్‌సైట్ నుంచి, కులగణన సర్వేలో విజ్ఞాపనలు అందాయి. ఏళ్ల తరబడి పంపిణీ లేకపోవడంతో కొందరు రెండుమూడు సార్లు దరఖాస్తు చేశారు. ఇప్పుడు వాటన్నింటిని వడపోసి ఒక్క దరఖాస్తే తీసుకోవడం అధికారులకు పరీక్షగా మారింది. అయితే, కులగణన సర్వేలో రేషన్‌కార్డులు కావాలని అడిగిన వారి జాబితాను తొలి ప్రాధాన్యంగా తీసుకుని పరిశీలిస్తున్నారు.
1న పంపిణీ చేయనున్న మూడు జిల్లాల్లో దాదాపు 1.12 లక్షల మంది రేషన్‌కార్డులకు అర్హులని ప్రాథమికంగా గుర్తించినట్లు పౌరసరఫరాలశాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో వికారాబాద్‌లో 22 వేలు, నాగర్‌కర్నూల్‌లో 15 వేలు, వనపర్తిలో 6 వేలు, నారాయణపేటలో 12 వేలు, మహబూబ్‌నగర్‌లో 13 వేలు, గద్వాలలో 13 వేలు, మేడ్చల్‌లో 6 వేలు, రంగారెడ్డిలో 24 వేల మంది ఉన్నారు. హైదరాబాద్ నగరంలో 285 మందినే గుర్తించారు. ఇక్కడ ఇంకా 83 వేల కుటుంబాలను పరిశీలించాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. తుది పరిశీలన తర్వాత దాదాపు లక్ష కుటుంబాలకు కార్డులు జారీ చేసే అవకాశం ఉంటుందని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వేలో 6.68 లక్షల కుటుంబాలు తమకు రేషన్‌కార్డులు కావాలని కోరాయి. ఇందులో 5.12 లక్షల కుటుంబాలను ప్రాథమికంగా అర్హమైనవిగా గుర్తించినట్లు సమాచారం. ప్రజాపాలన కార్యక్రమంలో ఏకంగా 18 లక్షల వినతులు వచ్చినట్లు సమాచారం.