ఎట్టకేలకు జర్నలిస్ట్ సమస్యలు విననున్న నిపుణుల కమిటీ
జర్నలిస్ట్ సంఘాల నిరసనకు తలోగ్గిన ప్రభుత్వం
సలహాలు, సూచనలు జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాలు, ప్రెస్ క్లబ్స్ ఇవ్వొచ్చు.
మీడియా నిపుణుల కమిటీ సమావేశంలో వెల్లడి.
తెలంగాణ ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ వినతిని స్వీకరించిన కమిటీ
ప్రెస్ అకాడమీ చైర్మన్ కు, అక్రిడేషన్ రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు
మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 27:: హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా మీడియా అక్రెడిటేషన్ కోసం తీసుకొచ్చిన జీవో 1395 లోని లోపాలు సవారించేందుకు ప్రభుత్వం స్వీకారం చుట్టడం పట్ల తెలంగాణ ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి. వై. గిరి, ఎం. శివ శంకర్ లు హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ జీవోపై తెలంగాణ ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ తో పాటు, మరికొన్ని జర్నలిస్ట్ సంఘాలు నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఆ జీవోపైన పునరాలోచనలో పడిపోయింది. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ మంజూరికి అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలు రూపొందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ప్రథమ సమావేశం తాజాగా బూర్గుల రామకృష్ణారావు భవనంలో జరిగింది. మీడియా అకాడమీ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, సియాసత్ న్యూస్ ఎడిటర్ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, హిందూ పొలిటికల్ ఎడిటర్ ఆర్ రవికాంత్ రెడ్డి, సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కె .నరహరి, సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ డి.యస్. జగన్ పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర హైకోర్టు తీర్పులు, నూతన మార్గదర్శకాలు, వివిధ రాష్ట్రాలలో అమలులో ఉన్న అక్రిడిటేషన్ కమిటీ నిబంధనలను, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ఇతర మీడియాకు అక్రిడిటేషన్ల అంశాలపై ప్రాథమికంగా చర్చించడంపట్ల టి.పి.జె.యూ రాష్ట్ర కమిటీ సంతోషం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో నూతన మార్గదర్శకాలపై ప్రస్తుతం జర్నలిస్టు యూనియన్లు/అసోసియేషన్లు, ప్రెస్ క్లబ్బులు, వ్యక్తుల నుండి ప్రత్యేక కమిటీకి రాతపూర్వకమైన సలహాలు, సూచనలను కమిటీ అమోదిస్తూ వచ్చే నెల నవంబర్ 15లోగా జర్నలిస్ట్ సంఘాలు, ప్రెస్ క్లబ్స్, సీనియర్ జర్నలిస్ట్ లు తమ సూచనల నివేదికలను తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, జాయింట్ డైరెక్టర్ (ఎం ఆర్) ఏసీ గార్డ్స్ హైదరాబాద్ వారికి అందజేయాల్సిందిగా కమిటీ కోరినందున జర్నలిస్ట్ సంక్షేమం కోసం ఉద్దేశించిన ఆయా నివేదికలు లిఖితపూర్వకంగా అందజేయాలనీ తెలంగాణ ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ కోరింది.