సీనియర్ నాయకులు గుండు అబ్బయ్య మృతి పార్టీకితీరని లోటు :సిపిఎం
ఆత్మకూర్ (ఎస్ ): సిపిఎం సీనియర్ నాయకులు గుండు అబ్బయ్య మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటుఅనిసిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు లు అన్నారు.బుధవారం మండల పరిధిలోని గట్టికల్ గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధులు,సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు గుండు అబ్బయ్య(85) గుండెపోటుతో బాధపడుతూ మృతి చెందారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ గట్టికల్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో అంతిమయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మృతదేహానికి ఎర్రజెండా కప్పి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.సందర్భంగా ఏర్పాటుచేసిన సంతాప సభలో వారు మాట్లాడుతూ అనేక పోరాటాలకు త్యాగాలకు నిలయమైన గట్టికల్ గ్రామంలో నిరుపేద కల్లు గీత కార్మిక కుటుంబంలో పుట్టిన గుండు అబ్బయ్య తన జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారని అన్నారు.చదువు,సంధ్య లేకున్నా పార్టీ నిర్ణయాలను, విధానాలను తూచా తప్పకుండా అమలు చేశారని అన్నారు. గట్టికల్ గ్రామంలో అనేక నిర్బంధాలు,ఆటంకాలు, శత్రువుల దాడులు వచ్చిన వాటిని తిప్పి కొట్టడంలో అబ్బయ్య ముందు ఉండేవాడని అన్నారు. శత్రువుల బారి నుండి కమ్యూనిస్టు పార్టీని,కార్యకర్తలను కాపాడడంలో అబ్బయ్య చూపిన తెగువ మరువలేనిది అన్నారు. గ్రామంలో భూస్వాములు చేస్తున్న ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి దొరలకు,భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలుచేశారని అన్నారు.తన జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన గొప్ప నాయకుడు గుండు అబ్బయ్య అన్నారు.తన కుటుంబాన్ని మొత్తంకమ్యూనిస్టు పార్టీలో ఉంచడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఎన్నో ప్రలోభాలకు గురై పార్టీలు మారుతున్న ఈ రోజుల్లో తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి కడదాక కమ్యూనిస్టు యోధుడిగా నిలబడి ఆ గ్రామ ప్రజల మన్నుల చొరగొన్న మంచి వ్యక్తిత్వం కలిగిన మహా నాయకుడు గుండు అబ్బయ్య అన్నారు. ఈ అంతిమ యాత్రలో ప్రజానాట్యమండలి కళాకారులు పాడిన విప్లవ గేయాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.సిపిఎం మండల కమిటీ సభ్యులు గుండు లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండ వెంకటరెడ్డి,సిఐటియు జిల్లా అధ్యక్షులుఎం రాంబాబు, ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బత్తుల సుధాకర్, సిపిఎం గ్రామ కార్యదర్శి రాచకొండ సైదులు, మాజీ ఎంపీటీసీ బొప్పాని కనకమ్మ, కొల్లు వెంకన్న,గుండు రమేష్,మాజీ సర్పంచ్ మడ్డి వెంకన్న, పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు భయ్యా మల్లికార్జున యాదవ్, బైరు కంట్లం,భయ్యా లింగయ్య, ఉయ్యాల నగేష్,గంపల ఎల్లయ్య, బెల్లంకొండ చక్రయ్య, తొట్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.