⏩:-పశువుల రవాణా, యువకుల దాడిని ఖండించిన బిజెపి నాయకులు
తాండూర్ మీ న్యూస్ జూన్ 4:-ఓ అటవీశాఖ అధికారి సూత్రధారి గా దగ్గర ఉండి అర్ధరాత్రి వేళ పశువులను తరలించడమే కాకుండా ,రవాణా ను అడ్డుకున్న యువకుల పై అక్రమార్కులు దాడికి ప్రయత్నించారు అని వారి పై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు. రమేష్ కుమార్ ,అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ ,పట్టణ కార్యదర్శి అంతారం కిరణ్ ,పెద్దేముల్ మండల బిజెపి యువ నాయకులతో కలిసి తాండూరు డి.ఎస్.పి బాలకృష్ణారెడ్డిని కలిసి పశువుల అక్రమ రవాణా, యువకుల దాడి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. పెద్దేముల్ మండలం జనగామ గ్రామ శివారులో ఓ అటవీ శాఖ అధికారి సూత్రధారిగా ఫామ్ హౌస్ నుంచి మంగళవారం అర్ధరాత్రి సమయంలో డీసీఎం వాహనంలో సుమారు 16 నుంచి 20 పశువులను తరలిస్తున్నారని, ఈ విషయాన్ని తెలుసుకున్న బిజెపి యువకులు రమేష్ సాగర్, రాము, అంజి తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. ఆ సమయం లో అక్రమ రవాణా పై డయల్ 100 కు కూడా ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించమని తెలిపారు. పోలీసులు సమయానికి అందుబాటులోకి రాలేకపోవడంతో అక్కడ ఉన్న అటవీశాఖ అధికారి దగ్గర ఉండి వాహనాలను తరలించారని పేర్కొన్నారు. తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేయగా పశువుల తరలిస్తున్న అక్రమార్కులు యువకుల పై దాడి కి ప్రయత్నించారని తెలిపారు. దీంతో పెద్దముల్ పోలీస్ స్టేషన్ లో అక్రమార్కులపై ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఈ సంఘటన పై డిఎస్పి బాలకృష్ణ రెడ్డి కి యువకుల ద్వారా ఫిర్యాదు మరోసారి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఫిర్యాదు పై నిజానిజాలను గుర్తించి వెంటనే అక్రమ రవాణా తరలిస్తున్న అక్రమార్కులను అలాగే అటవీశాఖ అధికారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో మారు ఇలాంటి సంఘటనలు జరిగితే పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని అన్నారు.