పూటకో మాట, రోజుకో వాగ్దానంతో రైతాంగాన్ని ఆట పట్టిస్తూ పబ్బం గడుపుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనానికి సమయం ఆసన్నమైందని రాష్ట్ర తెలుగు రైతు సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు విమర్శించారు.
మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 20:: సూర్యాపేట జిల్లా కోదాడ.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులంటే కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఈషన్ మాత్రం లెక్క లేదని చెప్పారు. గత పది నెలలుగా రైతు రుణమాఫీ, రైతు భరోసా పధకాలపై ఒక్కోమంత్రి ఒక్కోరోజు ఒక్కోరకంగా మాట్లాడుతున్న తీరే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే ఎంత చిన్న చూపో, ఎంత అలుసో తేటతెల్లం అవుతున్నదని చెప్పారు. ఇన్నాళ్లు కమిటీలంటూ, అభిప్రాయ సేకరణలంటూ సదస్సులు నిర్వహించి తీరా ఇవ్వాళ్ల వానాకాలం రైతు భరోసా ఇవ్వట్లేదని చెప్పడానికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మలకు సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులు సాధుస్వభావులు, రోడ్లు ఎక్కరు, ఉద్యమాలు చెయ్యలేరు అన్న ధీమాతోనే ప్రభుత్వం రైతాంగం పట్ల అలసత్వం చూపుతున్నదని ఆరోపించారు. రైతాంగానికి చేసిన వాగ్దానాలను తుంగలోకి తొక్కి మోసం చేస్తే రాబోయే ఎన్నికల్లో రైతులే కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చరించారు.