⏩ :-సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు
మీ న్యూస్ ప్రతినిధి: మోతే:ఆదర్శనేత,ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు,తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు జీవితాంతం పీడిత ప్రజల కోసం పోరాడిన ఆదర్శ నేత సమాజ గమనాన్ని నిరంతరం అధ్యయనం చేసి ప్రజలలో పోరాట పటిమను పెంచిన అధ్యయన శిలీ కామ్రేడ్ సుందరయ్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు అన్నారు. సోమవారం పుచ్చలపల్లి సుందరయ్య 40 వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో మోతే మండల పరిధిలోని విబలాపురం, సిరికొండ, మోతే, బుర్కచర్ల, రాఘవాపురం గ్రామాలలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాకుండా వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడి 10 లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు పంపిణీ చేసిన యోధుడు సుందరయ్య అని కొనియాడారు. పీడిత ప్రజల కోసం తన ఆస్తులు భూములను దానం చేసి సమాజం కోసం పిల్లల్ని కూడా వద్దనుకున్న ఆదర్శనేత పుచ్చలపల్లి సుందరయ్య అన్నారు.చట్టబద్ధ పదవులను అనుభవించినప్పటికీ ఆడంబరాలకు పోకుండా సైకిల్ పైనే పార్లమెంటుకు వెళ్లి పేద ప్రజల సమస్యలను చట్ట సభలలో చర్చించిన మహోన్నత నేత సుందరయ్య అని అన్నారు. చట్ట సభలలో వ్యక్తులపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న విధానాల ప్రాతిపదికగా అర్థవంతమైన రీతిలో ప్రజా సమస్యలను చర్చించి పార్లమెంటును ప్రజా సమస్యల చర్చా వేదికగా నిలిపారన్నారు. అగ్రకులంలో పుట్టినప్పటికీ వివక్షకు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి దళిత చేత ఆలయ ప్రవేశాలు చేయించి, సహపంక్తి భోజనాలు నిర్వహించిన ఆదర్శ నేత సుందరయ్య అని కొనియాడారు. సమాజంలో వస్తున్న మార్పులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న చట్టాలను అధ్యయనం చేసి ప్రజలను పోరాటాల్లోకి తీసుకువచ్చి వారిని చైతన్యం చేశారని అన్నారు. నీటి వనరులను వినియోగం, భూమిపై ఉన్న సహజ వనరులు ప్రజలందరివని సంపద వికేంద్రీకరణ జరగాలని దున్నేవాడికే భూమి ఇవ్వాలని ప్రజల కోసం భూ పోరాటాలు చేసిన మహోన్నత నేత సుందరయ్య స్ఫూర్తితో ఆర్థిక, సామాజిక,రాజకీయ అసమానతలు లేని సమాజం కోసం చేసే పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు కక్కిరేణి సత్యనారాయణ, కాంపాటి శ్రీను, నాగం మల్లయ్య, బూడిద లింగయ్య, దోసపాటి శ్రీనివాస్, కిన్నెర పోతయ్య, చర్లపల్లి మల్లయ్య,గుంట గాని యేసు, జంపాల స్వరాజ్యం,ముల్కూరి మణెమ్మ, నాగం వినోద, షేక్ మొగలాల్, మిడిదొడ్డి శ్రీరాములు, శ్రీకాంత్, ఎడమ పద్మ, ఎరుకల యాదమ్మ, తురుక నాగమ్మ, బోడ పట్ల హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.