పంటల మద్దతు ధర, ఉత్పత్తి ఖర్చుల నియంత్రణ చట్టం చేయాలి
⏩:: మార్చి5న సూర్యాపేట కలెక్టరేట్ ముందు ధర్నా
మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట: పంటలకు మద్దతు ధర, ఉత్పత్తి ఖర్చుల నియంత్రణ చట్టం చెయ్యాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మార్చి 5న సూర్యాపేట కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా( ఎస్ కే యం) జిల్లా కన్వీనర్ లు మల్లు నాగార్జున రెడ్డి, మండారి డేవిడ్ కుమార్, వరికుప్పల వెంకన్న అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహ రెడ్డి భవన్ లో సంయుక్త కిసాన్ మోర్చా సమావేశంలో వారు మాట్లాడుతూమద్దతు ధర నూటికి 70 శాతం ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ప్రజలు జీవిస్తున్నప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తులతో మనిషి బ్రతుకుతున్నప్పటికీ పాలకులకు మాత్రం రైతులు వ్యవసాయం పట్టింపు లేదన్నారు. పైగా ఆరుగాలం కష్టం పండించిన పంటలను మార్కెట్లో దోచుకునే విధంగా, రైతుల భూములను కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా చట్టాలను రూపొందించి తమ నైజాన్ని తేట తెల్లం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ రైతుల వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ప్రకటించకుండా కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా రాయితీలు సబ్సిడీలు మాఫీలు ఇస్తున్నారని ఈ క్రమంలో రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ రైతు కుటుంబాలు దిక్కులేని పరిస్థితిలోకి నెట్టి వేయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 52 శాతం మందికి ఉపాధి అవకాశాలు కేవలం వ్యవసాయ రంగంలోని లభిస్తున్నాయని, ఈ స్థితిలో పాలకులు ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం రైతులకు ఆశాజనకమైన హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా తాత్సారం చేస్తూ మోసం చేస్తున్నారని అందుకు ప్రత్యక్ష నిదర్శనమే రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా అన్నారు. ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడేలా ఎరువుల సబ్సిడీ తగ్గించి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా వ్యవసాయ ఉత్పత్తులను తగ్గించేలా కేంద్రం కుట్ర చేస్తుందని ఇప్పటికే ఆహార సంక్షోభం ఆకలి చావులలో ప్రపంచంలో 105 దేశంగా భారత్ ఉందని ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి కల్పనకు కృషి చేయాల్సిన కేంద్రం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేవలం 86 వేల కోట్లు మాత్రమే కేటాయించి జాబ్ కార్డులను తగ్గిస్తుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర బడ్జెట్ ను సవరించి వ్యవసాయ రంగానికి కనీసం ఐదు లక్షల 50 వేల కోట్ల రూపాయలను కేటాయించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం 15% బడ్జెట్ వ్యవసాయ రంగానికి ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో చెప్పినట్లు రైతులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు వ్యవసాయ కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించి కూలి పెంచాలని కోరారు. రైతులకు వెంటనే పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సన్నధాన్యానికి క్వింటాకు500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ అమలు చేయలేదని ఆరోపించారు. రైతులందరికీ రైతు భరోసా అమలు చేయాలని కోరారు. ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి తుంగతుర్తి,సూర్యాపేట, కోదాడ నియోజకవర్గ రైతాంగాన్ని కాపాడాలని కోరారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని మార్చి 5న సూర్యాపేట కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ లు నల్లెడ మాధవరెడ్డి, మట్టిపల్లి సైదులు, దండ వెంకట్ రెడ్డి, కునుకుంట్ల సైదులు పాల్గొన్నారు.