schedule Saturday, June 13, 2026

మే 20న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె

calendar_today May 7, 2025
person meenewstelugu

 మే 20న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె

 తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట:కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అన్నిరంగాల కార్మికవర్గం పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం గతంలో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ 4లేబర్ కోడ్ లను తీసుకొస్తున్నారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాలరాయబడ్డాయి. 8గంటల పనిని 12గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంబంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ రంగంలో కార్మికొద్యమం మీద, కార్మిక ఐక్యత మీద దాడి చేస్తుంది. కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికొద్యమం దెబ్బ తీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం 11 సంవత్సరాల కాలంలో రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందన్నారు. రైతాంగం పోరాటం సందర్భంగా ఇచ్చిన ఈ ఒక్క హామీని నేటికీ అమలు చేసిన పాపాన పోలేదన్నారు. స్వామినాథన్ సిఫారసులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టానికి రోజురోజుకు నిధులు తగ్గిస్తూ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. రెండు పూటలా ఉపాధి కార్మికులు హాజరు వేయాలని నిబంధన మూలంగా కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చేశారు. పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించి రోజు కూలి 600 రూపాయలు ఇచ్చి ప్రతి కుటుంబానికి 200 రోజులు పనులు కల్పించాలన్నారు. కార్మిక ఐక్య పోరాటలను ఉదృతం చేస్తూ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన మే 20 దేశ వ్యాపిత సమ్మెను కార్మిక వర్గ కర్తవ్యంగా భావించి ప్రతీ కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకటరెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, తెలంగాణ రైతు జిల్లా ఉపాధ్యక్షులు కందాల శంకర్ రెడ్డి పాల్గొన్నారు.